ప్రముఖ పోస్ట్‌లు

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఏపీ రాజధాని జయవాడలో టీవీ సీరియల్‌ నిర్మాణం..... 'అంకురం' సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో....

   ఫ్యూచర్‌ఆల్‌ మీడియా హౌస్‌ సారథ్యంలో జాతీయ అ”ార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు  దర్శకత్వాన నిర్మాణం కానున్న టీవీ సీరియల్‌కు గాను వివిధ వర్గాలకు చెందిన కళాకారుల ఎంపిక ఇటీవల  విజయవాడ, బ్యాంక్‌ కాలనీలోని పరుచూరి కమ్యూనిటీ హాలులో రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ ఎంపికలో నగరంనుంచే కాకుండా విశాఖ, ఏలూరు, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాలనుంచి కూడా అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల 'మౌనపోరాటం' కథ ఆధారంగా టీవీ సీరియల్‌ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయి. 'నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడ' నేపథ్యంలో ఫ్యూచర్‌ ఆల్‌ మీడియా హౌస్‌ సారథ్యంలో టీవీ సీరియళ్లే కాక సినీమాలు కూడా నిర్మించనున్నట్లు చెబుతున్నారు. మారుతున్న రాజకీయ పరిణాల నేపథ్యంలో విజయవాడలో టీవీ సీరియల్‌ నిర్మాణం ప్రారంభం కావడం శుభపరిణామని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫ్యూచర్‌ ఆల్‌ మీడియా హౌస్‌ ఆవిర్భావం
రియల్‌ ఎస్టేట్‌ ప్రపంచంలో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్న  ఫ్యూచర్‌ ఆల్‌ సంస్థ కొత్తగా మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. 'ఫ్యూచర్‌ఆల్‌ మీడియా హౌస్‌' ను  లాంఛనంగా విజయవాడలో ప్రారంభించి మరో సంచలనానికి నాంది పలికింది. ప్రజలకు మార్గదర్శకంగా ఉండేందుకు, వినోదాన్ని కలిగించేందుకు తాము సీరియల్స్‌ చిత్రీకరించడానికి, భవిష్యత్తులో మీడియా పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సంకల్పించామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చింతా రవికుమార్‌ పేర్కొన్నారు. ఆయన విజయవాడ హోటల్‌ ఫార్చ్యూన్‌ మురళీ పార్కులో ఫ్యూచర్‌ ఆల్‌ మీడియా హౌస్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  మీడియా హౌస్‌  లక్ష్యాలను, ధ్యేయాలను వివరించారు. ఆయనతో పాటు సీఈఓ రామశేషు, జాతీయ అ”ార్డు గ్రహీత,  ప్రముఖ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి సి. సుజాత వేదికనలంకరించారు. రవికుమార్‌ మాట్లాడుతూ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందనే నేపథ్యంలో  విజ్ఞాన, వినోదాలు కలిగించేందుకు ఒక బలమైన వేదిక మీడియాహౌస్‌ను ఏర్పాటు చేసే అవకాశం ప్రప్రథమంగా తమకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన మౌనపోరాటం అనే నవలను  టీవీ సీరియల్‌గా చిత్రీకరించేందుకు అంగీకరించారని, అలాగే అంకురం దర్శకులు, జాతీయ పురస్కార గ్రహీత ఉమామహేశ్వరరావు దీనికి దర్శకత్వం వహించేందుకు అంగీకరించారని, దీనికంతటికీ హెచ్‌డిఓగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సుజాత ముందుకు వచ్చారని ఆయన వివరించారు. మీడియా హౌస్‌ ఏర్పాటు వెంటనే ఈ మూడు అద్భుతాలు వరుసగా జరగడం తమకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. సమీప భవిష్యత్తులో తాము తమ సంస్థ నుంచి అనేక ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. దర్శకులు ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంస్థ నుంచి మరెన్నో ఉత్తమమైన కార్యక్రమాలు రావాలని ఆకాంక్షించారు. తాను ఇటీవల చెన్నై వెళ్లానని, అక్కడ మీడియా హౌస్‌లు సమర్థంగా, ప్రయోజనకరంగా పనిచేస్తున్నాయని, అలాగే ఇక్కడి మీడియా హౌస్‌ కూడా అభిమానుల విశేషాదరణకు నోచుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మీడియా హౌస్‌ ద్వారా ఎన్నో కార్యక్రమాలకు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. రచయిత్రి సుజాత మాట్లాడుతూ తాను గతంలో ప్రింట్‌ మీడియాలోనూ, ఎలెక్ట్రానిక్‌ మీడియాలోనూ పనిచేసిన అనుభవం ఇప్పుడు పనికి వచ్చిందని, సిఈఓ రామశేషు తన ప్రత్యేకను గుర్తించి తనకు ఈ అవకాశం ఇవ్వడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని  ఆహూతులను వేదికపైకి ఆహ్వానించడంతో పాటు వందన సమర్పణ చేసే వరకు సిఈఓ రామశేషు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గుర్తించదగిన విజయాలు సాధించామని, ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగు పెట్టామని, ఇందులో కూడా ప్రజల మెచ్చుకునే రీతిలో కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. పూర్వాశ్రమంలో తాను పాత్రికేయరంగంలో ఉండి సంపాదించుకున్న అనుభవం ఇపుడు ఉపయోగ పడుతోందని చెప్పారు. అందరికీ పలు విధాలుగా ఉపయోగపడే తమ కార్యక్రమాలకు స్థానిక మీడియా వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల, చానళ్ల పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి