ప్రముఖ పోస్ట్‌లు

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఏపీ రాజధాని జయవాడలో టీవీ సీరియల్‌ నిర్మాణం..... 'అంకురం' సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో....

   ఫ్యూచర్‌ఆల్‌ మీడియా హౌస్‌ సారథ్యంలో జాతీయ అ”ార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు  దర్శకత్వాన నిర్మాణం కానున్న టీవీ సీరియల్‌కు గాను వివిధ వర్గాలకు చెందిన కళాకారుల ఎంపిక ఇటీవల  విజయవాడ, బ్యాంక్‌ కాలనీలోని పరుచూరి కమ్యూనిటీ హాలులో రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ ఎంపికలో నగరంనుంచే కాకుండా విశాఖ, ఏలూరు, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాలనుంచి కూడా అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల 'మౌనపోరాటం' కథ ఆధారంగా టీవీ సీరియల్‌ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయి. 'నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడ' నేపథ్యంలో ఫ్యూచర్‌ ఆల్‌ మీడియా హౌస్‌ సారథ్యంలో టీవీ సీరియళ్లే కాక సినీమాలు కూడా నిర్మించనున్నట్లు చెబుతున్నారు. మారుతున్న రాజకీయ పరిణాల నేపథ్యంలో విజయవాడలో టీవీ సీరియల్‌ నిర్మాణం ప్రారంభం కావడం శుభపరిణామని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫ్యూచర్‌ ఆల్‌ మీడియా హౌస్‌ ఆవిర్భావం
రియల్‌ ఎస్టేట్‌ ప్రపంచంలో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్న  ఫ్యూచర్‌ ఆల్‌ సంస్థ కొత్తగా మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. 'ఫ్యూచర్‌ఆల్‌ మీడియా హౌస్‌' ను  లాంఛనంగా విజయవాడలో ప్రారంభించి మరో సంచలనానికి నాంది పలికింది. ప్రజలకు మార్గదర్శకంగా ఉండేందుకు, వినోదాన్ని కలిగించేందుకు తాము సీరియల్స్‌ చిత్రీకరించడానికి, భవిష్యత్తులో మీడియా పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సంకల్పించామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చింతా రవికుమార్‌ పేర్కొన్నారు. ఆయన విజయవాడ హోటల్‌ ఫార్చ్యూన్‌ మురళీ పార్కులో ఫ్యూచర్‌ ఆల్‌ మీడియా హౌస్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  మీడియా హౌస్‌  లక్ష్యాలను, ధ్యేయాలను వివరించారు. ఆయనతో పాటు సీఈఓ రామశేషు, జాతీయ అ”ార్డు గ్రహీత,  ప్రముఖ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి సి. సుజాత వేదికనలంకరించారు. రవికుమార్‌ మాట్లాడుతూ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందనే నేపథ్యంలో  విజ్ఞాన, వినోదాలు కలిగించేందుకు ఒక బలమైన వేదిక మీడియాహౌస్‌ను ఏర్పాటు చేసే అవకాశం ప్రప్రథమంగా తమకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన మౌనపోరాటం అనే నవలను  టీవీ సీరియల్‌గా చిత్రీకరించేందుకు అంగీకరించారని, అలాగే అంకురం దర్శకులు, జాతీయ పురస్కార గ్రహీత ఉమామహేశ్వరరావు దీనికి దర్శకత్వం వహించేందుకు అంగీకరించారని, దీనికంతటికీ హెచ్‌డిఓగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సుజాత ముందుకు వచ్చారని ఆయన వివరించారు. మీడియా హౌస్‌ ఏర్పాటు వెంటనే ఈ మూడు అద్భుతాలు వరుసగా జరగడం తమకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. సమీప భవిష్యత్తులో తాము తమ సంస్థ నుంచి అనేక ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. దర్శకులు ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంస్థ నుంచి మరెన్నో ఉత్తమమైన కార్యక్రమాలు రావాలని ఆకాంక్షించారు. తాను ఇటీవల చెన్నై వెళ్లానని, అక్కడ మీడియా హౌస్‌లు సమర్థంగా, ప్రయోజనకరంగా పనిచేస్తున్నాయని, అలాగే ఇక్కడి మీడియా హౌస్‌ కూడా అభిమానుల విశేషాదరణకు నోచుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మీడియా హౌస్‌ ద్వారా ఎన్నో కార్యక్రమాలకు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. రచయిత్రి సుజాత మాట్లాడుతూ తాను గతంలో ప్రింట్‌ మీడియాలోనూ, ఎలెక్ట్రానిక్‌ మీడియాలోనూ పనిచేసిన అనుభవం ఇప్పుడు పనికి వచ్చిందని, సిఈఓ రామశేషు తన ప్రత్యేకను గుర్తించి తనకు ఈ అవకాశం ఇవ్వడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని  ఆహూతులను వేదికపైకి ఆహ్వానించడంతో పాటు వందన సమర్పణ చేసే వరకు సిఈఓ రామశేషు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గుర్తించదగిన విజయాలు సాధించామని, ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగు పెట్టామని, ఇందులో కూడా ప్రజల మెచ్చుకునే రీతిలో కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. పూర్వాశ్రమంలో తాను పాత్రికేయరంగంలో ఉండి సంపాదించుకున్న అనుభవం ఇపుడు ఉపయోగ పడుతోందని చెప్పారు. అందరికీ పలు విధాలుగా ఉపయోగపడే తమ కార్యక్రమాలకు స్థానిక మీడియా వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల, చానళ్ల పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

25, జులై 2014, శుక్రవారం

కథారచయిత్రి సుజాతకు రాజారాం అవార్డు

ప్రముఖ  స్ర్తీవాద రచయిత్రి సి. సుజాతకు ఇటీవల గుంటూరు అరండల్ పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా అభ్యుదయ రచయితల సంఘం సారథ్యంలో  డాక్టర్ మధురాంతకం రాజారాం అవార్డు ప్రదానంతో పాటు సాహితీ సత్కారం ఘనంగా జరిగింది.

2, ఏప్రిల్ 2014, బుధవారం

ఆస్టిన్‌లోని షిర్డీ సాయి మందిరమే నిదర్శనం

        అపార కారుణ్యం, మానవత్వం, వైరాగ్యం.. ఈ మూడూ ముప్పేటలా అల్లుకున్న మహా దివ్యరూపం శ్రీసాయి. ఆయన బోధనలు కాలాతీతం. ఎన్నటికీ, ఎప్పటికీ సజీవం. అవి ఖండాలకు అతీతంగా అఖండమై వెలుగొందే చైతన్యదీప్తులు. అందుకు ఆస్టిన్‌లోని షిర్డీ సాయి మందిరమే నిదర్శనం. శ్రీసాయి జనులకు నేర్పిన నిరాడం బరత్వం, సేవాభావం, మానవత్వం, త్యాగం, నిస్వార్థం అనే సుగుణాలను విశ్వ వ్యాప్తం చేసే లక్ష్యంతో  క్రెగ్‌, జిల్‌ దంపతులు భారతీయ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులైన తీరు ఆసక్తికరం.
ఆధ్యాత్మిక పయనం.. అన్వేషణ
క్రెగ్‌, జిల్‌ ఎడ్వర్డ్స్‌ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హవాయి ద్వీప ప్రాంతానికి చెందిన వారు. యుక్త వయసులో వీరిద్దరికి మెడిటేషన్‌, వేదాలపై ఆసక్తి మెండు. వాటికి సంబంధించిన అధ్యయనం, పరిశీలన వీరి నిత్య వ్యాపకంగా ఉండేది. వివాహానికి పూర్వం, 1970 ప్రాంతంలో మెడిటేషన్‌పై అధ్యయనం సాగించేందుకు యూరోప్‌ దేశాలకు వెళ్లిన సందర్భంలో అక్కడి ఫెయిర్‌ ఫీల్డ్‌లోని మహర్షి ఇంటర్నే షనల్‌ యూనివర్సిటీలో ఒకరికొకరు తారస పడ్డారు. ఇద్దరి అభిరుచులూ, ఆసక్తులు కలవడంతో పరిచయం ప్రేమగా మారి, 1979లో వివాహం చేసుకుని ఒక్కటయ్యా రు. వేద విజ్ఞానం, అందులో పేర్కొన్న అద్భుతమైన నైతిక విలువలతో కూడిన సంఘ జీవనం, వేద సంస్కారాలు, క్రియల పట్ల వారిలో మరింత ఆసక్తి పెరిగింది. ఇద్దరూ కలిసి మరింత అన్వేషణ సాగించారు. ఈ క్రమంలోనే యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ)లోనే మొట్టమొదటి షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించిన పాండు రంగ మల్యాలతో ఏర్పడిన పరిచయం వీరి ఆధ్యాత్మిక జీవితాన్ని మేలి మలుపు తిప్పి ంది. పాండురంగ 2002లో ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి క్రెగ్‌ దంపతులు సహాయ పడ్డారు. మరోపక్క, భారతీయ యోగవిద్య, వేదవిజ్ఞానం, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంచు కున్న వీరు 2000-2010 సంవత్సరాల మధ్యలో పలుమార్లు భారతదేశంలో పర్య టించారు. పలు ప్రపంచ శాంతియజ్ఞాల్లో పాలుపంచుకున్నా రు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లోని వైవిధ్యం, భారతీయ ఆధ్యాత్మికతలోని మార్మికత, మానవీయ విలువల వైశిష్ట్యం అమితంగా నచ్చిన క్రెగ్‌, జిల్‌ దంపతులు.. 2004లో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 18 రోజుల పాటు నిర్వి ఘ్నంగా, అద్వితీయంగా భారీ యాగాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞంలో దాదాపు 50 వేలకు మందికిపైగా భక్తులు పాల్గొని తరించారు.
ఎందరో దేవుళ్లు.. ఎన్నెన్నో తత్వాలు.. కానీ మనవత్వాన్ని మించిన గొప్ప హితం మరేము ంటుంది?. షిర్డీ అనే కుగ్రామంలో సాయినాథుడనే సద్గురువు అందరికీ భిన్నంగా ప్రేమ, సేవ, మానవత్వమనే గొప్ప గుణాలను బోధించారని తెలిసి.. క్రెగ్‌, జిల్‌ దంపతుల అన్వేషణ షిర్డీకి చేరింది. అక్కడితో వారి ఆధ్యాత్మిక జిజ్ఞాసతీరింది. తాము చేరుకోవాల్సిన గమ్యమేమిటో తెలుసుకున్నారు. బాబా బోధనల్లోని సారాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. వాటిని మనసా, వాచా, కర్మణా ఆచరిస్తూ మరెందరినో ఆ బాటలో నడిపించేందుకు కంకణబద్ధులయ్యారు. అన్నిటికీ మించి వీరు బాబాలో మహిమల్ని కాక, మాన వత్వం తాలూకు మహిత సత్యాన్ని దర్శించ గలిగారు. ప్రపంచంలో కానీ, భారత దేశంలో కానీ షిర్డీ సాయిబాబా వంటి యోగి మరొకరు లేరని, బోధనలు చేసి ఊరు కోవడం కాక వాటిని స్వయంగా ఆచరించి చూపిన అద్భుత యోగీశ్వరుడు బాబా అని గట్టిగా విశ్వసించారు. అక్కడితో వారి అన్వే షణ ముగిసింది. అప్పటి నుంచి కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది.
అదిగో.. అల్లదిగో ఆస్టిన్‌ సాయి మందిరం
2003 సంవత్సరంలో తాము ఉండే హవాయి ద్వీప ప్రాంతంలో ఒక దేవాల యాన్ని నిర్మించాలని తలపోశారు. సంకల్పిం చుకున్నారే కానీ.. ఎన్నెన్నో కష్టనష్టాలు వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో 2006లో వీరు హవాయి వదిలి ఆస్టిన్‌ చేరుకున్నారు. 2007, మకర సంక్రాంతి నాడు అక్కడ షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని తలపించే రీతిలో సుందరమైన సాయి మందిరాన్ని నిర్మించారు. మానవత్వం, ప్రేమ, సేవ, ప్రశాంతత.. ఇవి అందరికీ పంచుతూ, అందరికీ అందిస్తూ అసలైన ఆధ్యాత్మికతకు కొత్త అర్ధాన్నిస్తూ ఈ దంపతుల కృషితో ఆస్టిన్‌లో షిర్డీ సాయిబాబా ఆలయం లాభా ర్జన లేని మత సంస్థగా ఆవిర్భవించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సౌత్‌వెస్ట్‌ స్టేట్‌ టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం ఉంది. ఈ మందిరం ఉన్న ప్రాంతాన్ని సెడార్‌ పార్క్‌గా వ్యవహరిస్తారు. సెడార్‌ పార్క్‌లోని ఈ మందిర స్థలం మొదట్లో ఒక షాపింగ్‌ మాల్‌. 2008లో తొమ్మిది ఎకరాల ఈ స్థలాన్ని క్రెగ్‌ కొనుగోలు చేసి 2.2 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో సాయి మందిరాన్ని నిర్మించారు. ఆలయం ప్రధాన హాలులో శ్రీసాయి శ్వేతవర్ణ మార్బుల్‌ విగ్రహం కళ్లతోనే 'రా.. రమ్మ'ని భక్తులను పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ఇదే హాలులో దత్తాత్రేయుని విగ్రహం కూడా ఉంది. ఈ ప్రధాన హాలు బయట ధుని ఉంటుంది. షిర్డీలోని బాబా మందిరంలో మాదిరిగానే ఇక్కడి ధుని కూడా నిత్యం ప్రజ్వలంగా వెలుగొందుతూనే ఉంటుంది. ధునికి సమీ పంలోనే 576 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనంలో హోమకుండం ఉంది. దీన్ని భారతీయ వైదిక సంప్రదాయ ప్రమాణా ల ప్రకారం (3þ 3 þ 3) నిష్పత్తిలో నిర్మిం చారు. మందిరం ప్రధాన హాలుకు వెనుక మెడిటేషన్‌ హాలు ఉంది. మధ్యలో మార్బుల్‌తో చేసిన బాబా వారి చిన్న  విగ్రహం ఉంటుంది. ప్రధాన హాలుకు మరోపక్క విశ్రాంతి గదులు, వంటగది ఉన్నాయి. ఈ వంటగదిలోనే బాబాకు నివేదించేందుకు, పూజానంతరం భక్తులకు పంచేందుకు అవసరమైన ప్రసాద పదా ర్థాలు తయారు చేస్తారు. సాయి మందిరం మొత్తం 7,700 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఉంది. మందిరానికి క్రెగ్‌ శాస్త్రి (క్రెగ్‌.. భారతీయతపై ఉన్న ఆసక్తితో తన పేరు చివర 'శాస్త్రి' చేర్చుకున్నారు), జిల్‌ ఎడ్వర్డ్స్‌ దంపతులు, ఆదిల్‌ దలాల్‌.. వీరు ముగ్గురూ గవర్నింగ్‌ బాడీ డైరెక్టర్లు. పూర్తి వాస్తు ప్రమాణాల ప్రకారం సాయి మందిరం రూపుదిద్దుకుంది. స్వామి విశ్వ ంజీ విశ్వయోగి, శ్రీకాళేశ్వర్‌ మార్గ దర్శక త్వంలో భారతీయ వాస్తుశాస్త్రాన్ని అధ్య యనం చేసి, దానిపై పట్టు సాధించిన పాశ్చా త్యుడు ఎరిక్‌ హామిల్టన్‌ సలహా సూచనల ప్రకారం సాయి మందిరం, దానికి అనుబం ధంగా ఇతర ఆలయ ప్రాకారాలకు రూప కల్పన చేశారు. 2013, మేలో మంది రం ప్రాంగణంలో ఒక మిలియన్‌ డాలర్ల వ్యయ ంతో కల్చర ల్‌ హాలును నిర్మించి ప్రారంభి ంచారు.  బాలవికాస్‌ తరగతుల నిర్వహ ణకు, సాంస్కృతిక, కళా, నృత్య (భరత నాట్యం, కూచి పూడి, కర్ణాటక, హిందుస్థానీ సంగీత కార్య క్రమాలు) ప్రదర్శనలకు ఈ హాలును విని యోగిస్తుంటారు.
నిత్య ఆరతులు.. పూజాధికాలు
షిర్డీలోని సాయి మందిరంలో నిత్యం ఏ రీతిగా పూజాధికాలు, ఆరతులు నిర్వహి స్తారో ఆస్టిన్‌లోనూ అదే మాదిరిగా క్రమం తప్పకుండా, అత్యంత భక్తిశ్రద్ధలతో ఇక్కడా పూజాధికాలు నిర్వహిస్తారు. బాబాకు సంవత్సరంలోని 365 రోజుల్లో, రోజుకు నాలుగు వేళల్లో నాలుగు ఆరతులివ్వడం ఇక్కడి ప్రధాన కృత్యం. ఆస్టిన్‌ సాయి మందిరం ద్వారాలు 2008 జనవరిలో మకర సంక్రాంతి నాడు తెరుచుకున్నాయి. తొలి ఎనిమిది నెలలు క్రెగ్‌ శాస్త్రి బాబాకు నిత్యం బాబాకు ఆరతులు ఇచ్చేవారు. 2008, ఆగస్టులో పురోహితుడిని నియమించారు. ప్రస్తుతం ఈ ఆలయంలో క్రమం తప్పకుండా పూజాధికాలు నిర్వ హించడానికి నలుగురు పురోహితులను పూర్తి కాలానికి నియమి ంచారు. ఈ ఆలయ పురోహితులు ఇటు ఆలయ పూజాధి కాలతో పాటు, ఆలయం పరిసర ప్రాం తాల్లో ఉన్న హిందువుల ఇళ్లలో అవసరమైన పూజలు, సంస్కారాలతో పాటు సందర్భాను సారం వైదిక కర్మలను నిర్వహి స్తుంటారు. హిందూ క్యాలెండర్‌ ప్రకారం ఏటా వచ్చే ఆయా పర్వదినాలు, పండు గలు, ప్రత్యేక దినాల్లో ఉత్సవాలు ఆస్టిన్‌ సాయి మందిరంలో 'నిత్య కల్యాణం .. పచ్చ తోర ణం' అన్న రీతిలో నిర్వహిస్తుంటారు. రామ నవమి, మహా శివరాత్రి, గురుపూర్ణిమ, కృష్ణాష్టమి, దేవీ నవరాత్రులు, హనుమాన్‌ జయంతి, వినాయక చవితి వంటి పర్వదినా లను అత్యంత  వైభవో పేతంగా నిర్వహిస్తారు.  అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఆస్టిన్‌ ఒకటి. టెక్సాస్‌లోని కెడార్‌ పార్కు సైతం శీఘ్ర ప్రగతి సాధిస్తోంది. ఇక్కడి సాయి మందిరాన్ని ఏటా దాదాపు యాభై వేలమందికి పైగా భక్తులు సందర్శిస్తుం టారు. ఒక అంచనా ప్రకారం దాదాపు ఇరవై వేల మంది భారతీయులు ఆస్టిన్‌, దాని పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
సాయిపథం.. సేవాపథం..
వేసవి కాలంలోని వారాంతాల్లో ఇక్కడ దాదాపు వెయ్యి మందికి పైగా భక్తులకు ఉచితంగా ప్రసాదం పంచుతుంటారు. ఆహార, ప్రసాద పదార్థాలను తయారు చేసేందుకు ప్రత్యేకించి వాలంటీర్లు ఉన్నారు. ప్రతి గురువారం, వారాంతంలో ప్రధానంగా భారీగా ప్రసాద వితరణ జరుగుతుంటుంది. అదే సమయంలో ఆస్టిన్‌లోని నిరుపేద, నిరాశ్రయులైన వారి కోసం కూడా కొంత ఆహారాన్ని సిద్ధం చేసి పంపిణీ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఇలా దాదాపు లక్ష మందికి పైగా ఆస్టిన్‌ వాసులకు అన్నదానం చేసినట్టు అంచనా. సాయి మందిర భక్తు లు ప్రతి ఆదివారం ఉదయం 250 ఆహార పొట్లా లను తయారు చేస్తారు.
వీటిని అన్నార్తులకు పంపిణీ చేస్తారు. అలాగే ప్రతి నెలలో ఒకరోజు మందిరం ద్వారా వందలాది మంది నిరుపేద స్కూలు చిన్నారులకు అన్నదానం చేస్తారు. సాయి మందిరం.. స్థానికంగా ఉన్న ఫుడ్‌ బ్యాంకు (ఇది ఆహారం లభించని కుటుంబాల ఆర్తిని తీర్చే సంస్థ) కార్యకలాపాలకు ఆర్థికంగా తోడ్పడు తుంటుంది. అలాగే నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసానికి వీలుగా స్కాలర్‌షిప్పులను సాయి మందిరం తరపున అందిస్తుంటారు. మధ్యలో బడి మానేసిన పిల్లల్ని గుర్తించి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. భాష, సాంకేతిక నైపుణ్యాలను పెంచడానికి పిల్లలకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
ఆస్టిన్‌లోనే కాక భారతదేశం లోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ సాయి మందిరం అన్న దానాలు విరివిగా నిర్వహిస్తోంది. వివిధ ఆధ్యాత్మిక, సేవా సంస్థల ద్వారా ఆస్టిన్‌ సాయి మందిరం ఇప్పటి వరకు దాదాపు లక్ష మందికి అన్నదానం చేసింది. 2014లో ఆంధ్రప్ర దేశ్‌లోని కాకినాడలో దేవీపీఠాన్ని కామాక్షి స్వామి (చెన్నై) ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అతిరుద్ర యాగం నిర్వహిం చారు. ఈ కార్య క్రమంలో భాగంగా ఆస్టిన్‌ సాయి మందిరం అన్నదానం నిర్వహించింది. ఇంకా భారత్‌లోని పలు ధార్మిక, సేవా సంస్థలకు ఇతోధికంగా  సాయి మందిరం తోడ్పడుతోంది. అంధుల కోసం ప్రత్యేక పాఠశాలలు, హెచ్‌ఐవీ  బాధిత చిన్నా రులకు చేయూతనిచ్చే కార్యక్రమాలు, వృద్ధాశ్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు.
చిన్నారుల్లో వికాసానికి 'బాల వికాస్‌'..
ఆస్టిన్‌ సాయి మందిరం 2009 నుంచి ప్రతి ఆదివారం 'బాల వికాస్‌' కార్యక్రమా లను నిర్వహిస్తోంది. ఎలిమెంటరీ స్కూలు పిల్లల్లో వికాసాన్ని కలిగించడంతో పాటు వారిలో నైతిక వర్తనను అలవరి చేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఏటా 150 నుంచి 180 మంది పిల్లలు ఈ తరగతుల్లో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. పిల్లలో మానవీయ విలువల్ని పాదుగొల్పడానికి ఈ తరగతులు, శిక్షణ కార్యక్రమాలను రూపొందించారు. శ్లోకాలను నేర్పడం, సూర్య నమ స్కార క్రియను ఆచరించడం, రామా యణ, భారతం, భాగవతాల నుంచి నైతిక విలువల్ని బోధించే కథల్ని సేకరించి ప్రతి వారం చదివించడం వంటి కార్యక లాపాలు ఈ శిక్షణలో భాగంగా ఉంటాయి. ఇంకా శ్రీ సాయి బోధించిన లీలల్లోని సారాన్ని సంగ్రహంగా, సరళంగా మలిచి నీతి యుక్తంగా బోధిస్తారు. హిందూ సంస్కకృతీ సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా 'బాల వికాస్‌' కార్యక్రమాలు రూపొందించారు.
సత్యమే స్ఫూర్తి..
భావిక భక్తులకు శ్రద్ధా స్థలం.. అలసిన మనసులకు విశ్రాంతి ధామం ఆస్టిన్‌ షిర్డీ సాయి మందిరం. కులాలకు, మతాలకు, జాతులకు భిన్నంగా ఇక్కడకు వచ్చి భక్తులు మానసిక స్వస్థతను పొందు తున్నారు.
ఆయననే పూర్తిగా నమ్ముకున్న క్రెగ్‌, జిల్‌ దంపతులు నిత్యం ఆత్మాను సంధానులై జనులకు మేలు చేయడంలోనే నిమగ్నమ య్యారు. మనుషుల్లో మరుగున పడి పోయిన మానవత్వాన్ని తట్టిలేపి ఉన్నత జీవనానికి, ఆధ్యాత్మిక సౌశీల్యానికి బాటలు వేస్తున్నారు. ''అంద రినీ ప్రేమించు.. సేవించు.. తోటివారికి చేతనైతే సాయపడు.. ఎవరినీ బాధిం చకు''.. ఇదే ఈ దంపతుల వాదం.. నినా దం. సంగ్రహంగా ఇదే వీరి జీవననాదం. అక్షరాలా ఇదే సాయిబోధను అనుస రించి రూపుదిద్దు కుంది అమెరికా సం యుక్త రాష్ట్రాల్లోని ఆస్టిన్‌ సాయి మంది రం. ఇది హిందూ దేవాలయంగా పరిగణనలో ఉన్నా, సాంకేతికంగా చూస్తే ఇది ఆ కోవలోకి రాదు. నిజం చెప్పాలంటే, సాయి మందిరం ప్రధాన ద్వారంపై ప్రపంచంలోని అన్ని ప్రధాన, ప్రముఖ మతాల చిహ్నాలు చిత్రించి ఉంటాయి. వీటితో పాటు- ''ఈ జగమే నా కుటుంబం'' అని ఉన్న అక్షరాలు వసుధైక భావనకు, బాబా బోధనలకు అద్దంపడుతుంటాయి. ''అందరూ నా వద్దకురండి'' అని స్వాగతం చెబుతు న్నట్టుగా బాబా దివ్యమంగళ విగ్రహం చిరుదరహాసాన్ని చిందిస్తుంటుంది. ఈ మందిరాన్ని హిందువులతో పాటుగా, ముస్లింలు, జొరాస్ట్రియన్లు, జైనులు, సిక్కులు కూడా తరచుగా, పెద్దసంఖ్యలో దర్శించు కుంటూ ఉంటారు. ఇక, పాశ్చా త్యులు సరేసరి.  నిత్యం సాయి మంది రంలో యోగా, మెడిటేషన్‌ వంటి మాన సిక వికాసం, ప్రశాంతత కలిగించే అభ్యా సాలు చేస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ''ట్రూత్‌'' శిల సత్యమేవ జయతే అనే నిజాన్ని నిరంతరం చాటుతుంటుంది. ''సత్యమే తల్లి. జ్ఞానం తండ్రి. సత్ప్రవర్తనే సోదరుడు. సౌహార్ద్రమే స్నేహం. శాంతి సతి. క్షమాగుణం కుమారుడు. ఈ ఆరు సుగుణాలు అందరికీ బంధువులు'' అని చాటే 'సత్యం' మనసులను, మనుషు లను కదిలిస్తుంది.
రూపుదిద్దుకుంటున్న వేంకటేశ్వరాలయం
ఆస్టిన్‌ కెడార్‌ పార్కులోని 9 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు ఎకరాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం విస్తరిం చి ఉంది. మిగతా ప్రదేశంలో ప్రస్తుతం శ్రీవేంకటేశ్వర ఆలయం రూపుదిద్దు కుంటోంది. 2012లో క్రెగ్‌ దంపతులకు ఇక్కడ మరో ఆలయం నిర్మిం చాలనే ఆలోచన వచ్చింది. అయితే ప్రధాన దేవతా మూర్తిగా ఎవరిని ఉంచాలనేది చిక్కుగా మారింది.
హనుమంతుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలను కున్నారు. అయితే అప్పటికే సాయి మంది రంలో హనుమాన్‌ విగ్రహం ఉంది. అనంతరం ఆస్టిన్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మెజారిటీ హిందువుల నుంచి కొద్దిపాటి అభిప్రా య సేకరణ జరిపారు. కొత్తగా నిర్మించే ఆలయంలో శ్రీవేంకటేశ్వ రస్వామి వారి విగ్రహాన్ని  ప్రతిష్ఠించాలనే అభ్యర్థనలు అత్యధికంగా వచ్చాయి. ఆస్టిన్‌.. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలున్న ప్రాంతం కావ డం, వారి ఇలవేల్పు వేంకటేశ్వరుడు కావడంతో ఆయన విగ్రహాన్నే నెల కొల్పాలనే నిర్ణయానికి వచ్చారు.
వెంటనే చెన్నైకి చెందిన స్థపతి శిల్పకళా నిలయాన్ని సంప్రదించి, ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం ఆలయ నిర్మాణ డిజైన్‌ రూపొందించారు. ప్రస్తుతం ఆలయం పనులు శరవేగంగా కొనసాగు తున్నాయి. ఇటీవలే వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విమాన గోపుర నిర్మాణానికి ప్రముఖ సాయి బోధకులు డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు సతీమణి రాజేశ్వరి అన్నవరపు శంకుస్థాపన చేశారు.
ప్రధాన ఆలయంలో ఏడు అడుగుల వేంకటేశ్వరస్వామి, శ్రీపద్మావతి, శివ, సహస్రలింగం, పార్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. వీరు ప్రధాన మూర్తులు. వీటికి సమీపంలోనే ప్రార్థన చేస్తున్న రీతిలో గల పది అడుగుల హనుమంతుని విగ్రహం, రామ్‌ పరివార్‌, రాధాకృష్ణ, శ్రీ దుర్గాదేవి కొలువుదీరు తారు. మరోపక్క సిద్ధిబుద్ధి సమేత గణపతి, అయ్యప్ప, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మ ణ్యేశ్వర స్వామి, నవగ్రహ విగ్రహాలు ఏర్పాట వుతాయి. ఇవన్నీ మొత్తం 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరనున్నా యి. 54 అడుగుల ఎత్తున దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో రాజ గోపురం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయ నిర్మాణా నికి మొత్తం 3.5 మిలియన్‌ డాలర్ల వ్యయం కాగలదని అంచనా. చెన్నై నుంచి వచ్చిన 21 మంది శిల్పులు అహోరాత్రులు ఆలయానికి రూపురేఖలు దిద్దుతున్నారు. వాస్తుశాస్త్ర రీత్యా ఏ దిశలో ఏం ఉండాలో వాటిని అమర్చు తున్నారు. ఆలయ ప్రాంగణ ంలోని పాండ్‌లో 60 కేజీల రోజ్‌ క్వార్ట్జ్‌ (స్పర్టిక) 'మెరు' ఏర్పాటు కానుంది. సింబల్‌ ఆఫ్‌ మదర్‌ డివైన్‌గా చెబు తున్న ఇది.. ఆలయానికి ఉన్న అన్ని ప్రతికూల దోషా లను పోగొడుతుందని ప్రతీతి. 'మెరు' నుంచి నిత్యం, నిరంతరాయంగా వెలువడే శ్రీ సూక్తం, రుద్ర నమకం ఆలయాన్ని పరిపుష్టం చేస్తాయని విశ్వాసం. విశ్వంజీ విశ్వయోగి (గుంటూరు) సలహా సూచనల మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
అమెరి కాలో హిందూ వైభవానికి, భారత ఆధ్యాత్మిక విశిష్టతకు ఈ నిర్మాణాలన్నీ నిద ర్శనం. ఏడాదిన్నరగా నిర్మాణం జరుపు కుం టున్న ఆస్టిన్‌లోని శ్రీ వేంకటేశ్వరాలయం.. అమెరికాలోని వెంకన్నఅలయాల్లోనే అతి పెద్దది కానుంది. భారతీయ పురాతన శిల్పకళా చాతుర్యానికి మచ్చు తునకగా నిలవనున్న ఈ ఆలయ నిర్మాణంలో 250 టన్నుల పదివేల రాళ్లనుభారత్‌లో చెక్కించి వినియోగిస్తున్నారు. శిలలతో అమెరికాలో నిర్మితమవుతున్న మొట్ట మొదటి ఆలయం కూడా ఇదే!. రాళ్లపై రాళ్లను అమర్చి పురాతన భారతీయ నిర్మాణ శైలిని జొప్పించి దీన్ని రూపొందిస్తు న్నారు.
ఆధ్యాత్మిక సారథి.. దేశాల మధ్య వారధి
ఆస్టిన్‌ సాయి మందిరం, త్వరలో ఆవి ష్కృతం కానున్న వేంకటేశ్వరాలయం పశ్చిమ, తూర్పు దేశాల ఆధ్యాత్మిక వారధిగా భాసిల్లనున్నాయి. అటు పాశ్చాత్యుల్ని, ఇటు సంప్రదాయవాదుల్ని, ఆధ్యాత్మిక పరుల్ని సూదంటు రాయిలా ఆకర్షిస్తు న్నాయి.
ఎందరెందరో ప్రముఖ గురు వులు, పండితులు, సిద్ధాంతులు, యోగులు ఆస్టిన్‌ సాయి మందిరాన్ని తరచుగా సందర్శి స్తుంటారు. స్వామిబోధానంద (కేరళ), స్వామి విశ్వంజీ విశ్వయోగి (గుంటూరు), సాధ్వి విజయేశ్వరి (ఆంధ్రప్రదేశ్‌), కామాక్షి స్వామి (చెన్నై), స్వామిభగవతీ సిద్ధార్‌ (చెన్నై), మదర్‌ మీరా (జర్మనీ) తదితరులు ఇక్కడకు వచ్చి తరచు ఆధ్యాత్మిక ప్రవచనాలు అంది స్తుంటారు. సాయిమందిరం ప్రారంభమై నప్పటి నుంచి క్రమంతప్పకుండా సాయి సచ్ఛరిత్ర సామూహిక పారాయణ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నారు.
అలాగే మందిర భక్తులు దాదాపు వంద లేదా 108 మంది ఆలయ ప్రాంగణంలో హనుమాన్‌ చాలీసా పారాయణ చేస్తుం టారు. గొప్ప ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమాలు అనంతమైన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంటాయి.

6, జనవరి 2011, గురువారం

కోటీశ్వరుడు సాయినాథుడు...


శిర్డీ సాయిబాబా లౌకికపరంగా కూడా మహా కోటీశ్వరుడు! ఆధ్యాత్మికపరంగా సుసంపన్నుడైన సాయినాదŠునికి భక్తులు సమర్పించిన ఆభరణాలు కోట్లాది రూపాయలుగా నిర్థారించారు. ఇహాలోకానికి సంబంధించిన ఈ స్వర్ణాన్ని స్వీకరించి పరలోకానికి చెందిన మహావిలువైన పుణ్యాన్ని మాకందించు సాయీ అంటూ భక్తులు బంగారు, వెండి వస్తువులు ఆయనకు సమర్పిస్తారు. సాయినాదŠుడు వాటిని తన కనుసన్నలలోనే ఉంచి, ఆయా భక్తులకు సద్గతులు సంప్రాప్తింపజేస్తాడు. నిజానికి బంగారం, వెండి తదితరాలకు విలువ మనం ఆపాదించు కున్నదే... కొంత కాలం వాటి విలువ తగ్గుతుంది... మరికొంత కాలం పెరుగు తుంది... అసలు బంగారం, వెండి తదితరలకే కాదు ఈ సృష్టిలో కనిపించే వాటన్నింటికీ విలువ మనం నిర్థారించుకున్నదే... ఈ బంగారాన్ని అగ్నిలో వేస్తే కాలుతుంది. సాగదీస్తే సాగుతుంది. ఎటు వంచితే అటు వంగుతుంది. శరీర అలంకారానికీ, ఈ లోకానికి చెందిన హాోదాకి తప్ప మరిదేనికి ఉపయోగపడుతుంది? దానిని చివరకు ఈ భూమిమీద వదిలి వేయాల్సిందే తప్ప మన వెంట తీసుకుపోలేము కదా...
కానీ శాశ్వత విలువ కలిగిందీ, దాని విలువ ఇంత అని నిర్ణయించలేనిదీ శిర్డీ సాయినాదŠుని వద్ద ఉన్నది. దానిని ఆయన మనకందిస్తే దానిని మన వెంట తీసుకుపోగలము! ఆయన ఇచ్చేది ఆత్మకు అంటుకునేది! శరీరానికి కాదు! దానిని అగ్నిలో వేస్తే కాలదు, నీటిలో తడవదు, వంచితే వంగదు. దాని విలువ మనం నిర్థారించలేం.
సరే ఇక లౌకిక పరంగా సాయి కోట్ల లెక్కలు చూద్దాం...
మహారాష్ట్రలోని శిర్డీ సాయిబాబా మందిరానికి రూ. 32 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు 2009-10 ఆడిట్‌ రిపోర్టులో వెల్లడైంది. వార్షిక ఆదాయం 164.99 కోట్లు లభించగా పెట్టుబడుల మొత్తం రూ. 427.17 కోట్లుగా ఆ నివేదిక పేర్కొంది. రూ. 24.41 కోట్ల బంగారం, రూ. 3.26 కోట్ల వెండి, రూ. 1.12 కోట్ల స్వర్ణ కంఠాభరణాలు ఉన్నట్లు సాయిబాబా సనాతన్‌ ట్రస్టు ఆడిటర్‌ శరద్‌ ఎస్‌. గైక్వాడ్‌ నివేదికలో వివరించారు.